Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page

మతం అంటే - అంబికా ధ్యానమే

మతం, మతం అని అంటూ ఉంటాం. మతమంటే ఏమిటి? అంబికా చరణారవింద ధ్యానమే మతం. ఆ ధ్యానఫలం మనంపూర్ణులమవడం. పుట్టినందులకు పుర్ణులుకావాలిగానీ ఎద్దువలె, మొద్దువలె జీవితంలో ఏవికాసమూ లేకుండా అవసాన కాలంలో గొడ్లవలె మరణించడం ఏంగొప్ప? శాంత్యానందాలు చిప్పిల్లుతున్నపుడు, అనాయాసంగా దైన్యరహితంగా మనం ప్రాణాలను వదలగల్గినట్లైతే, అదియే పూర్ణత్వం. ఆపూర్ణత్వమే మనలక్ష్యమైతే ఆలక్ష్యసిద్ధికోసం పాటుపడటమే. మనుద్దేశ##మైతే మనకు ఆహారం కావాలి, ఉద్యోగం కావాలి. లేకుంటే ఏదీ అక్కరలేదు. పెళ్ళాం అక్కరలేదు, బిడ్డలు అక్కరలేదు. సంసార అక్కరలేదు.

లోకంలో పుట్టినవాళ్ళందరూ ఏనాడో ఒకనాడుగతించవలసినదే. అందురూకలసి ఒక్కమారుగా చావగల్గితే అదీ మంచిదే, చావటం ఏ విధంగా చస్తేఏం? కాని దానిలోనూ వ్యత్యాసంఉన్నది. హెచ్చుతక్కువలున్నవి. అంబికా చరణారవిందా ధ్యానంలో మనం అసువులను బాయకల్గితే అది అమృతం. మన అశాంతిని పోగొట్టి, ఆనందాన్ని ఇచ్చేవి అమ్మవారి పాదాలే. అందుచేత ఆమెపాదాలు ధ్యానిస్తూ ప్రాణాలను వదలడమే అమృతం. పూర్ణత్వం అది చావుకాదు. మోక్షం.

ఇదే మనలక్ష్యమైతే, మనమతమైతే మనం అప్పుడప్పుడూ ఆత్మశోధ చేసుకుంటూ వుండాలి. మనం ఎంతవరకు పూర్ణంలో పడ్డాం? ఎంతవరకు సాధన అందుబాటులోనికి వచ్చింది? ఇంకాగమ్యం ఎంతదూరంలో ఉంది? అని అపుడపుడు పరీక్ష చేసుకుంటూ ఉండాలి. కామం మనలను బాధిస్తున్నదా! కోపంతో మనం ఊగిపోతున్నామా! మనచిత్తశుద్ధిఏమాత్రం? అన్న విచారం అప్పుడప్పుడు ఉంటూఉండాలి. ఇట్టి ఆత్మశోధనకు అనుకూలంగా ఉండేదే స్వప్నం. స్వప్నావస్థలో మనకు కామక్రోదాదులు కలుగుతున్నంతవరకు వలసిన చిత్తశుద్ధి లభ్యంకాలేదనే అనుకోవాలి. ఈవిచికిత్స, ఈవిచారం ఉన్నంతవరకూ మనం జీవిత ప్రయోజనంకోసం పాటుపడుతున్నామని అర్థం. లేకుంటే మనజీవితాలు వ్యర్థం. ఆత్మశోధన లేదనుకొందాం, అపుడు మనం బ్రతికి ఏంప్రయోజనం? ఉద్యోగం చేస్తేఏం? మానితేఏం? ఈ ఆత్మశోధన ఒకటి ఉంటేనే మనం మతం మతం అని తిరుగవచ్చు.

మనం పెళ్ళాడుతున్నాం, బిడ్డలను కంటున్నాం. ఒక జీవుడికి మనుష్యజన్మను కల్పిస్తున్నాం. జీవుడికి పుట్టుక ఉంటే కాని పూర్ణత్వ మందుకోడానికి మార్గంలేదు. 'ప్రజనశ్చాస్మి కందర్పః' మనుష్యునికి కామంకలగడం సంతానోత్పత్తి నుద్దేశించి. ఇంతేకాని కేవలం తనసుఖాన్ని ఉద్దేశించికాదు. కానీ మన ప్రవృత్తులు మనలను మోసగిస్తూ ఉంటాయి. ఇట్లు మనలను స్వామి ఆశాపాశ బద్ధులను చేసి వేడుక చూస్తుంటాడు.

రసనేంద్రియం ఉన్నది. అదికోరుకొనే రుచులను లెక్కలేదు. ఈరసనేంద్రియానికి రసించేశక్తి లేకపోతే, మనం దేనిని పడితే దానిని తినవచ్చు. రుచులను ప్రత్యేకించవలసిన అవసరంలేదు. రుచి ఉన్నందువల్లనే అదికావాలి, ఇదికావాలి అని నోరుఊరేటట్లు మనుష్యుడు కలవరిస్తుంటాడు. కానీ మనకు నాలుక నిచ్చినది దానినీ, దీనినీ తిని ఆనందించటానికి కాదు. ఆహారంవల్ల శరీరంవృద్ధి అవుతుంది. నాలుకతో రుచి ఉండటం దేహవృద్ధికోసం.

మనం ఏదో ఒకపని తొందరలో ఉంటాం ఒక పసిపాప ఎదురు పడుతుంది. బోసినవ్వులు ఒలకపోసుకుంటూ మనచేతిలోనిపని పరారు అవుతుంది. పాపను ఎత్తుకుంటాం. ముద్దులను కురిపిస్తాం. ఆ పాప కూతురో, మనుమరాలో అయి ఉంటుంది. అదే సమయంలో ప్రక్కటింటి పాపవస్తే మనకు చీకాకు. ఏదో అతృప్తి. మన పాపలందు మనకు అధిక వాత్సల్యం. ఆ వాత్సల్యమే లేకపోతే ఆ పాప స్రుక్కవలసినదే. మనం కన్న పాపలపైన మనకే ప్రీతిలేకపోతే, ఆ పాపలగతేంకావాలి? అందుచేతనే స్వామి మనకు మనసు బిడ్డలపైన తగని అభిమానం ఉంచాడు. అదేవిధంగా, మన మన శరీరాలు ఆరోగ్యంగా పెరగాలనే నాలుకకు రుచి కల్చించాడు ప్రభువు.

మనం పుట్టడమే మరొక జీవుడు శరీరంతాల్చే వీలుకోసం మనకు దేవుడు కామం కలుగచేయడమూ దానికోసమే, దానిచేత ఆ జీవుడికి క్షేమం కలుగుతుంది. కానీ ఇవన్నీ వృథాకదా అని ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది. మనకు కల్గే కామక్రోధాలన్నీ ఏ ప్రయోజనమూలేక, మన పాపాభివృద్ధికేగదా తోడ్పడుతున్నవి. పూర్ణత్వాన్ని ఎవరూ పొందటంలేదే? ఇట్లు సందేహం కలుగవచ్చును. కాని ఈ సందేహాలు అక్కరలేదు.

ఒక మామిడిచెట్టులో ఎన్నో కాయలున్నవి. ఎన్నో పండ్లున్నవి. వీని అన్నిటిలోనూ బీజం అనగా టెంక ఉన్నది. ఈ టెంకలన్నీ మామిడిచెట్లు అవుతున్నవా? బీజముంటేకాని మరొకచెట్టు మొలకెత్తదు. కానీ ఇన్ని మామిడిటెంకలూ చెట్లు కావడంలేదు. ఇన్ని ఫలాలలో, ఏ ఒకటైనా ఫలిస్తేచాలు. తక్కినవన్నీ వ్యర్ధమైనా బాధలేదు. మన విషయమూ అంతే, ఇంతమంది మానవులమున్నా, మనలో ఏ ఒక్కడైనా పూర్ణత్వాన్ని సాధించగల్గితే ఆ ఒక్కనివల్ల లోకం ఎనలేని సౌఖ్యాన్ని పొందుతుంది. అన్ని కాలాలలోనూ అలాంటి మహనీయుడేయొకడో అవతరిస్తూ ఉన్నాడనిమనంకథలలో చూస్తున్నాం.

'బహూనాం జన్ననామంతే జ్ఞానవాన్‌ మాంప్రపద్యతే అని భగవానుడు సెలవిస్తున్నాడు. ఒక్కొక్కప్పుడు వీథులలో వేడుకకు ఎత్తులో ఒక ఉట్టిని కటతారు. దానిని అందుకోవాలి. ఐదుగురు వరుసగా నిలుచుంటారు. వారి భుజాలపై ముగ్గురు, వారి భుజాలపై ఇద్దరు. ఆ ఇద్దరి భుజాలపై మరొక్కడు నిలుచుంటాడు. అతి ప్రయాసతో ఉట్టిని అందుకొంటాడు. అనుకొన్న దానిని సాధిస్తాడు. ఇంతమందీ ఆ ఒక్కడి విజయానికోసం సహకరించారన్నమాట. ఇంతమందీ ఆ ఆటలలో పాల్గొని వాని లక్ష్యసిద్ధికి తోడ్పడ్డారు అదే విధంగా ఈ వేలకొలది మనుష్యులలో ఏఒక్కడో తనలక్ష్యం కోసం, అవిరామంగా సాధన సాగిస్తుంటాడు. ఇంతమందీ వాని సాధనలో సహకరించడానికే. వాడు పూర్ణత్వం అందుకొంటే ఇంతమంది పుట్టుకా సార్థకమవుతుంది. ఇన్ని కోవెలలూ, అన్ని మతములూ. ఇంత ప్రచారమూ - ఇవన్నీ వాని పూర్ణత్వంతో సార్ధకమౌతాయి.

ఇంట్లో చెత్తా చెదారమూ ఉంటుంది. ఇంటిని శుభ్రం చేసుకొంటాం. దేహం శుభ్రంగా ఉండాలనో స్నానంచేస్తాం. మరి మనస్సును శుభ్రం చేయటం. ఏ విధంగా? జగన్మాత అయిన శ్రీరాజరాజేశ్వరీ చరణారవింద ధ్యానంతో మన మనస్సులు లయించిపోయి పూతమైపోవాలి.

కొందరు మన మతానికి ప్రచారం తక్కువ అని అంటూ ఉంటారు. మన మతాన్ని మనం చక్కగా అనుష్ఠిస్తూవస్తే దానికంటే ఘనతరమైన ప్రచారం వేరే ఏది ఉంటుంది? కొన్ని మతాలు డబ్బిచ్చి మామతంలో చేరు అని ప్రోత్సహిస్తూ ఉంటాయి. అట్టి మతాలకు కరవు కాలంలో చాలాఅభివృద్ధి. మరికొన్ని మతాలు కత్తిచూపి 'నామతంలో చేరుతావా లేక నిన్ను నరికివేయనా' యని జళిపిస్తూ ఉంటాయి. ఆ మతాలకు యుద్ధకాలంలో ఎక్కడలేని వృద్ధి. మన మతం అదికాదు. ఒక్కడు పూర్ణత్వమొందినా చాలు. ఆ ఒక్కనివల్ల ఈలోకం అనంత సౌఖ్యంతో వర్థిల్లాలి అన్నదే మన మతం.

ప్రచారం అన్న మాటవస్తే మన ఆచారం మొదట ఎలావుందో గమనించుకోవాలి. మనం సరిగా నడుచుకొంటేకదా మనం ప్రచారానికి బయలు దేరగలం. మనకే పూర్ణత్వంలేక వెలితితో ఉంటే మనం యితరులకు ఏమి ఉపకారం చేయగలం? నాలోనే కొరతుంటే. నేను చెప్పేదంతా ఇతరులను మోసగించడమేకదా? భగవంతుడి అనుగ్రహమే నాకు పూర్తిగా కలిగినట్లైతే, ఇతరులకు చెప్పవలసిన అవసరమే ఉండదు. ఉపన్యాసాలు చేసేదానికి బదులు, నాలోపాలేమిటి? వానిని నేను ఏవిధంగా సంస్కరించుకోగలను? అన్న ఆత్మశోధన చేసుకొనగల్గితే దానివల్ల ఎంతో ప్రయోజనముంటుంది. 'ఉద్ధరే దాత్మనాద్మానం' అనడమే మన మతం.

క్రైస్తమతం. ఇస్లాంమతం, బౌద్ధమతం - ఇట్లు ఎన్నో మతాలున్నవి. వీని కన్నిటికీ కాలపరిణామం కద్దు. అయితే ఈ మతాలు పుట్టుకముందు, లోకం ఎలాగుండినది? ఆకాలంలో జ్ఞానులేలేరా? లేరనిచెప్పేవారూ ఉన్నారు. ఆ కాలం చీకటి కాలం, అజ్ఞానకాలం అని వారన్నారు. కాని చరిత్రను చూస్తే ఈ మతాలన్నీ పుట్టకపూర్వమే వేదములు ఆధారంగా వైదికమన ముండినదని తెలుస్తున్నది. కాని కాలక్రమేణా క్షీణిస్తూ వచ్చించి. ఒకప్పుడు అంతటా వ్యాపించి ఉన్న వైదికమతం క్షీణించడానికి కారణం మనమే. మనమతం మృద్థికావాలంటే ఒక్కటేమార్గం. అనుదినమూ అంబికా చరణారవింద స్మరణలో మనం మునిగిపోవాలి.

మనకందరికీ ఏదో ఒక మంత్రోపదేశం ఉంటున్నది. పంచాక్షరి, అష్టాక్షరీ, గాయత్రి - ఇట్లు ఒక్కొక్క మంత్రం ఒక్కొక్కరికి ఉపదేశ##మై ఉంటున్నదికదా! వారి వారి మంత్రాలను వారు వారు సకృత్తుగా జపిస్తూ వచ్చినట్లైతే ప్రచార ప్రసక్తి దేనికి వస్తుంది? ఇట్లాకాక మనం ప్రచారం ప్రచారం అని బయలుదేరితే మనమతం వృద్థికాదు. వారు వారు నమకు ఉపదిష్టమైన మంత్రాన్ని జపిస్తూవస్తే ఏ ఒక్కరిద్దరో ఆమంత్రసిద్ధితో పూర్ణత్వాన్ని అందుకోగలరు. వారివల్ల లోకమూ క్షేమ మొందగలదు. మనమూ క్షేమ మొందగలము. అంతేకాక మనమున్నూ బాగుపడుతుంది. అందుచేత మన మందరమూ, అమ్మవారి పాదాలమీదపడి స్తోత్రధ్యాన ప్రదక్షిణాదులలో మైమరచిపోవాలి.

మనసాధన ఏ మాత్రానికొచ్చింది? అన్న పరీక్ష మనకు అప్పుడప్పుడూ ఉంటూ ఉండాలి. ఆ పరీక్షార్థమే స్వామిస్వప్నావస్థను కల్పించాడు. జాగ్రదవస్థలో శరీరం ఏదోకర్మలో నియుక్తమై ఉంటుంది. నిద్రావస్థలో శరీరస్మృతిలేదు. 'చక్కగా నిద్రించాను.' అని నిద్రనుండి లేచినవెనుక అంటున్నాము. నిద్రావస్థలో మనస్సన్నూ లయించి పోయినది. కామాక్షీ కటాక్షము మనకు కల్గినదాయని పరీక్షించు కొనడానికి ఒక మార్గమున్నది. మనస్వప్నావస్థలో మనకు ఏలాంటి విషయాలు అనుభవానికి వస్తున్నవి? మనం 'ఆమెను ఆరాధిస్తున్నట్లు కానీ, పూజచేస్తున్నట్లుకానీ, ధ్యానం చేస్తున్నట్లుకాని, కలలు కంటున్నామా? లేక దొంగఇంట్లో చొరబడి నగలెత్తుకొని పోతుంటే అతనిని తరుముకొని పోతున్నట్లూ లేక వేరే ఏదో కామంతో వేగి పోతున్నట్లూ కలలు కంటున్నామా? గమనించాలి.

ఊరివారికి మహాభక్తుడు అన్న అభిప్రాయ ముండవలెనని పాటుపడే వేషధారుల కలలలో దొంగలే కనిపిస్తుంటారు. అట్టివారికి స్వప్నంలోనూ కామచింతనలే ఉంటాయి. నిజమైన భక్తికలవారికి, ధ్యానంలో తన్మయంగా ఉన్నట్లో, నామజపం చేస్తున్నట్లో స్వామిదర్శనం చేస్తున్నట్లో కలలువస్తుంటవి. ఇట్లా కలలు కంటున్నపుడు మన మనస్సుకు ఏదోతృప్తిగా ఉంటుంది. మనభక్తిని ఈవిధంగా స్వప్నమూలంగా శోధించుకోవచ్చు.

మనమతం భక్తిచేతా, ధ్యానంచేతా ఆత్మశుద్ధి చేసుకొన్నందువల్లనే వృద్ధి పొందినది. ఇతర మనములు ప్రచారంచేతా, ప్రబోధంచేతాన పెరిగి ఉండవచ్చు, కలహంచే కొన్ని మతాలు వ్యాపించవచ్చును. ఇతర మతాలు ఇట్లు తీవ్రంగా ప్రచారంచేస్తున్నా, డబ్బిచ్చి మనుష్యులనుమభ్యపెడుతున్నా, 'మా మతంలో చేరండి మా మతం ఎంతో గొప్పది'. అని ఆహ్మానిస్తున్నా, ఈ ఆహ్వానాలకు తబ్బిబ్బులై వెలికిపోయే వారిని మనము తరిమి వేస్తున్నా, మన మతాన్ని ఇంతమంది జనులు ఇంకా అంటిపెట్టుకొన్నారంటే కారణమేమిటి? మనలో అన్ని కాలాలలోనూ ఎవరో ఒక మహనీయుడుంటున్నాడు. ఆయనను చూచినపుడు చూపరకు తెలియకుండానే ఏదో గౌరవం కల్గుతున్నది, సద్భావం కల్గుతున్నది. చూచీ చూడటంతోటే అతనిలో ఏదో ఒక భక్తి కల్గుతున్నది. అందుచేత అతనికి మతంలో శిథిలమౌతున్న నమ్మకం దృఢమౌతున్నది. మనమతం అభివృద్ధి కావాలంటే ఇతరులు ఏంచేస్తున్నారో దానినే మనమూ పాటిస్తాం. అనడం సరికాదు. మనమతం ఏర్పడినరీతి అదికాదు.

చెట్లు పుష్పించేసరికి, తుమ్మెదలు తమంతతామేవస్తవి. వానికి ఆహ్వానం అక్కరలేదు. మనలో ఏ ఒక్కరైనాసరే భగవద్భక్తితో ఆత్మసౌఖ్యాన్ని పొందగల్గితే పూర్ణత్వ మొందకల్గితేలోకం అతనిని అనుసరించడానికి సిద్ధంగా ఉంటుంది. దీనికై ప్రచారం అవసరం మరి ఈ ఉపన్యాసాల మాటేమి? ఇవన్నీ ఎందులకు? అన్న ప్రశ్నవస్తే ఏదో తత్కాల శాంతి కోసం, తృప్తికోసం మాత్రమే. ఈ ఉపన్యాసాలు చేసేకాలంలోనూ, పరాశక్తి ధ్యానంచేస్తూ, పరమేశ్వరి నాదస్మరణచేస్తూ ఉండి పోవచ్చును. అలా ఉండిపోగల్గితే మన మతానికి ఏలాడూ కొరత ఏర్పడదు.

మతమతానికి నిజంగానే కొరత ఉన్నదనుకొందాం. ఆ కొరత ఏనాటికీ మరొక మనకారణం గారాదు. మన అనుష్ఠానలోపమే దానికి కారణం. శరీరంలో శక్తిలోపిస్తున్నప్పుడు వ్యాధిగ్రస్తమౌతున్నది. వ్యాధి కలుగతున్నదంటే కారణం మన బలహీనతయే.

శివపూజా, పంచాక్షరీ, అష్టాక్షరీ - మనలో ఎందరు ప్రతిదినమూ చేస్తున్నారు? ఎవరోకొందరు చేస్తుండవచ్చు. పుస్తకశాలలో ఎన్నో పుస్తకములున్నా అమ్మేవాడికి వాటి జ్ఞానం ఉండదుకదా! అదే విధంగా మనలో అనుభవలోపం ఏనాడో వచ్చినది. రానురాను మరింత క్షీణిస్తున్నది. ఇట్లు మనమతం క్షీణించడం, ఇతరమతాలు అభివృద్ధికావడం మన అనుష్ఠాన లోపంచేతనే.

అందుచేత ఆత్మసంస్కారానికి అమ్మవారి పాదములే గతి. ఆ పరాశక్తి పూజయే నాకుముఖ్యం. లోకక్షేమేకోసం ఆమె చరణారవిందములనే ఆరాధిస్తూ వస్తున్నాను. ఈ ఆరాధన అందరూ చేయవలసినది. ఆ ఈశ్వరి అర్థనారీశ్వర స్వరూపంగాను ఉన్నది. లోకక్షేమార్థము ఒకే బ్రహ్మస్వరూపము పరమశివుడుగానూ, మహావిష్ణువుగానూ, బ్రహ్మగానూ - త్రిమూర్తి స్వరూపములుగానూ ఉన్నది. ఇది లోకానుగ్రహం కోసం.

అమ్మవారు బ్రహ్మ, విష్ణు, శివాత్మక, ఆమె సృష్టికర్త్రియై బ్రహ్మరూపిణిగా నున్నది. ఆమెయే గోస్త్రియు, గోవింద రూపిణియూ, రుద్రరూపంలో సంహారిణియై లోకాలను తిరోధానంచేస్తున్నదీ ఆమెయే. ఒక్కతే ఇట్లు వివిధ రూపాలతో విలసిస్తున్నది. దీనిని మనంగుర్తించి ఆమె పాదారవిందాలను ధ్యానించి తరించడమే మనమతం. ఒకప్పుడు మన మనమే లోకమంతా వ్యాపించియుండివది. కానీ ఇపుడు మారిపోయినది. మనమతం అభివృద్ధి కామాలంటే 'వసుధై కుటుంబం' మనది అన్నజ్ఞప్తి ఉండాలి. అనుదినం ఆత్మశోధ చేసుకుంటూ ఆత్మ సంస్కారానికి పాటుపడాలి. పూర్ణత్వమే మనలక్ష్యం అన్న నిశ్చయంతో ఆలక్ష్యసిద్ధికై తీవ్రసాధన చేయాలి. మనలో ఏ ఒక్కరైనా పూర్ణులము కాగల్గితే ప్రచారం అక్కరలేదు. ఆ పూర్ణత్వం సిద్ధించాలంటే, పరమేశ్వరికృప ఉండవలె. ఆకృప కలుగునంతవరకు మన ఇచ్ఛాద్వేషాలు మనలను వదిలిపోవు. దోషదృష్టి వదలిపోదు. భీతివీడదు. ఆత్మోపలబ్థి దవ్వులలోనే వుంటుంది. ఇన్ని ఆలయాలు ఇన్ని మంత్రాలూ మనలో ఏఒక్కడైనాసరే ఆత్మజ్ఞానియై లోకక్షేమం చేయడముకోసమే ఏర్పడినవి. వానికోసం లోకం ఎదురుచూస్తుంటుంది. ఆ ప్రయోజనం పరమేశ్వరి అనుగ్రహం ఉంటేకాని సిద్ధించదు. ఆమె చరణాలు నమ్ముకొని, ఆధ్యాన నిరతిలో తేలిపోవడమే మనమతం.


Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page